

ఐపీఎస్ అధికారిణి సంయుక్తా పరాశర్ సీఆర్పీఎఫ్ ప్రత్యేక దళం కోబ్రా యూనిట్ ఐజీగా నియమితులయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 2006 బ్యాచ్‌కు చెందిన అస్సాం-మేఘాలయ క్యాడర్ అధికారిణి అయిన సంయుక్త.. 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి దనేష్ రాణా స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. భద్రతా బలగాల్లో మహిళల నాయకత్వానికి ఆమె నియామకం కీలక ఘట్టంగా నిలిచింది.
అస్సాంకు చెందిన సంయుక్తా పరాశర్ గతంలో స్వరాష్ట్రంలో విధులు నిర్వహించడంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లోనూ సేవలందించారు. అస్సాంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో, తిరుగుబాటు ప్రభావిత ప్రాంతాల్లో పలు క్లిష్టమైన ఆపరేషన్లను నిర్వహించిన అనుభవం ఆమెకు ఉంది. ఈ కఠినమైన ఆపరేషన్ల నేపథ్యంలో ఆమెను ‘ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం’గా పిలుస్తారు. దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన సంయుక్త.. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియా 85వ ర్యాంకు సాధించారు.
2008లో మావోయిస్టులు, ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు సీఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్‌ను ఏర్పాటు చేశారు. జంగిల్ వార్‌ఫేర్, గెరిల్లా ఆపరేషన్లలో ఈ యూనిట్ ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంది. మణిపుర్‌లో సాయుధ హింసను నియంత్రించేందుకు సీఆర్పీఎఫ్ ఇటీవల రెండు కోబ్రా యూనిట్లను కూడా మోహరించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!