

తెలంగాణలో మైనర్లు ద్విచక్ర వాహనాలు, కార్లు నడిపే ఘటనలపై రవాణాశాఖ కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే ముందుగా వాహనాన్ని సీజ్ చేసి, బాలుడితో పాటు వాహన యజమానిపైనా కేసు నమోదు చేస్తారు. పోలీసులు ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసిన తర్వాత రవాణాశాఖ వాహనం ఆర్సీని ఏడాది పాటు రద్దు చేస్తుంది. అనంతరం యజమాని కోర్టుకు హాజరై మేజిస్ట్రేట్ ఆదేశాలను పాటించాలి. జరిమానా, సామాజిక సేవ లేదా జైలు శిక్ష వంటి చర్యలు ఉండొచ్చు. మైనర్ జువనైల్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ కేసుల్లో చిక్కిన మైనర్లకు 25 ఏళ్లు వచ్చే వరకు లెర్నర్ లైసెన్స్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ జారీ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మైనర్లు నడిపిన వాహనాలపై చర్యల సంఖ్య కూడా పెరుగుతోంది. 2024–25లో రాష్ట్రవ్యాప్తంగా 1,760 వాహనాల ఆర్సీలు రద్దు కాగా.. అందులో సుమారు 80 శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివేనని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి మూడు నెలల్లోనే 1,455 ఆర్సీలు రద్దయినట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా మైనర్లు నడిపిన 4,070 వాహనాల ఆర్సీలను ఏడాది పాటు రద్దు చేశారు. ఇకపై డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్ల ఆధార్, ఇతర వివరాలను సారథి పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో 25 ఏళ్లు వచ్చే వరకు వారికి లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ జారీ కాకుండా వ్యవస్థలోనే అడ్డుకట్ట వేయనున్నారు. పాత కేసుల వివరాలను కూడా పోర్టల్‌లో నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!