

ఏలూరు జిల్లా ముసునూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పర్యటించారు. ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో కలిసి గార్మె పాప్‌కార్న్ నాన్-జీఎంఓ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలను ఆవిష్కరించారు. అనంతరం పాప్‌కార్న్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని సందర్శించి తయారీ విధానాన్ని పరిశీలించారు. రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన సీఎం.. దేశీయంగా నాన్-జీఎంఓ హైబ్రిడ్ విత్తనాలను రైతులతో కలిసి ఉత్పత్తి చేస్తున్న గార్మె సంస్థను అభినందించారు.
ప్రస్తుతం 17,500 మంది రైతులు సుమారు 40 వేల ఎకరాల్లో నాన్-జీఎంఓ హైబ్రిడ్ మొక్కజొన్నను సాగు చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. నూజివీడు సమీపంలోని ముసునూరులో దేశంలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ ప్లాంట్లలో ఒకదాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. విత్తనాల సరఫరా, యాంత్రీకరణ, సాగులో సాంకేతికత, రైతుల నుంచి పంట కొనుగోలు వరకు మొత్తం ప్రక్రియ వ్యవస్థీకృతంగా సాగుతోందని పేర్కొన్నారు.
నూజివీడు ప్రాంతంలో పండే పాప్‌కార్న్ దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు కూడా చేరుతోందని సీఎం చెప్పారు. రైతులు పండించిన పంటలకు విలువ జోడించి, ప్రాసెస్ చేసి, మంచి బ్రాండ్‌తో అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆంధ్రా పాప్‌కార్న్, అరకు కాఫీ, కొండపల్లి చెక్క బొమ్మలు వంటి స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు ఫుడ్ ప్రాసెసింగ్ వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!