

పెరుగుతున్న జీవన వ్యయాలు, ఆర్థిక అనిశ్చితి, భవిష్యత్తుపై ఆందోళనలు జెన్‌జీ యువతను ప్రధాన ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయ మార్గాల వైపు మళ్లిస్తున్నాయి. నెలవారీ జీతంపైనే పూర్తిగా ఆధారపడటం కష్టంగా మారడంతో ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, ఆన్‌లైన్ పని, చిన్న వ్యాపారాల వంటి మార్గాలను యువత ఎంచుకుంటోంది. వీటి ద్వారా ప్రధాన ఆదాయానికి అదనంగా సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది.
డెలాయిట్ 2026 జెన్‌జీ, మిలీనియల్ సర్వే ప్రకారం భారత్‌లో 54 శాతం మంది జెన్‌జీ ఆర్థిక ఆందోళనల కారణంగా జీవితంలోని కీలక నిర్ణయాలను వాయిదా వేసినట్లు తెలిపారు. మరో 20 శాతం మంది రోజువారీ లేదా నెలవారీ ఖర్చులను భరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఇల్లు కొనుగోలు చేయడం, పొదుపు పెంచుకోవడం, భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించడం వంటి అంశాలు యువతకు సవాళ్లుగా మారుతున్నాయి.
ప్రధాన ఉద్యోగంతో పాటు అదనపు పని చేయడాన్ని సైడ్ హస్ల్ అంటారు. డెలాయిట్ 2026 సర్వే ప్రకారం జెన్‌జీలో దాదాపు 30 శాతం మంది పార్ట్‌టైమ్ లేదా ఫుల్‌టైమ్ అదనపు పనులు చేస్తున్నారు. సైడ్ హస్ల్స్ ద్వారా అదనపు ఆదాయం పొందడంతో పాటు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడంపైనా యువత దృష్టి పెడుతోంది. ప్రధాన ఉద్యోగం ద్వారా స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే కొత్త రంగాలను అన్వేషించేందుకు ఇవి అవకాశాన్ని కల్పిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!