

వలసదారుల సంఖ్య పెరుగుతుండటంతో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక వలసలను నియంత్రించడంలో భాగంగా విదేశీ విద్యార్థుల ప్రవేశంపై పరిమితులు విధించింది. 2027 నుంచి 2029 వరకు ఏటా లక్షన్నర మంది అంతర్జాతీయ విద్యార్థులను మాత్రమే దేశంలోకి అనుమతించనున్నట్లు రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) వెల్లడించింది. విద్యా అవకాశాలు, కార్మికుల అవసరాల మధ్య సమతుల్యత సాధించడంతో పాటు వసతి సౌకర్యాలు, ప్రజా సేవలపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యార్థులతో పాటు ఇతర తాత్కాలిక వలసదారుల సంఖ్యపైనా పరిమితులు విధించింది.
తాజా నిర్ణయం ప్రకారం 2027 నుంచి 2029 వరకు కెనడా ఏటా 3.7 లక్షల మంది తాత్కాలిక వలసదారులను అనుమతించనుంది. ఇందులో 1.5 లక్షల మంది విదేశీ విద్యార్థులు కాగా, మరో 2.2 లక్షల వీసాలను తాత్కాలిక విదేశీ ఉద్యోగులకు కేటాయించనుంది. ఈ ఏడాది కూడా కెనడా ఇలాంటి నిబంధనలను అమలు చేస్తూ 2026లో 1.55 లక్షల మంది విదేశీ విద్యార్థులకు అనుమతి ఇచ్చింది. కొత్త నిబంధనలు కెనడాకు వెళ్లాలనుకునే కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులపై ప్రభావం పడే అవకాశం ఉంది. అక్కడ తాత్కాలిక వలసదారుల సంఖ్య పెరగడంతో గృహ వసతి, ప్రజా సేవలపై ఒత్తిడి పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కెనడా ఏటా 2.44 లక్షల మందికి శాశ్వత నివాస హోదా కల్పిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!