

యాదగిరిగుట్ట ఆలయ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్‌పై రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె అనుచరులు, బీసీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. సోమవారం మన్సూరాబాద్‌లోని శివచరణ్ రెడ్డి నివాసాన్ని ముట్టడించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాళ్లు, కర్రలతో జరిగిన దాడిలో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు కార్యకర్తలు గాయపడగా, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై నిరసన చేపట్టిన ఆందోళనకారులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ ఘటన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను బయటపెట్టింది. దీనిపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించి, ఘటనపై నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిని ఆదేశించారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్చార్జి మధుయాష్కీ గౌడ్ కూడా స్పందిస్తూ, ఈ వ్యవహారాన్ని పీసీసీ, ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈశ్వరమ్మ బోర్డు సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో శివచరణ్ రెడ్డి తండ్రి ఫొటో లేకపోవడంపై మొదలైన వివాదం, చివరకు ఘర్షణకు దారితీసినట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!