

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అండాల విక్రయం వ్యవహారంలో డాక్టర్ పి. పద్మజ పాత్ర కీలకమని, ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేయరాదని పోలీసులు తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. సరూర్‌నగర్, బేగంపేట పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ డాక్టర్ పద్మజ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు మంగళవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు కౌంటర్ దాఖలు చేయడంతో తదుపరి విచారణను నవంబర్ 19కి వాయిదా వేశారు. గత నెలలో సరూర్‌నగర్‌లోని షెట్టీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో తనిఖీలు నిర్వహించగా వివిధ రాష్ట్రాలకు చెందిన 15 మంది మహిళలను అండాల దాన ప్రక్రియ కోసం సిద్ధంగా ఉంచినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు దుర్గాప్రసాద్ బ్రోకర్‌గా వ్యవహరిస్తూ ఒక్కో అండానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లిస్తామని ఆశ చూపి వారిని హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. హాస్టల్లో హార్మోన్ ఇంజెక్షన్లు, మందులు, వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నామని, ఆరుగురు నిందితుల్లో ప్రధాన నిందితుడైన దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు వివరించారు.
విచారణలో దుర్గాప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. హబ్సిగూడలోని పద్మజ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ పద్మజతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. సింధు సారబోజు, చాందినీ అనే ఇద్దరు మహిళలు ఆస్పత్రికి, బ్రోకర్‌కు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. బాధితులైన 15 మంది మహిళల వాంగ్మూలాలను నమోదు చేశామని, వారిని పద్మజ, నర్మద, ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్లలో అండాల దాన ప్రక్రియకు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి సరూర్‌నగర్, బేగంపేట, మియాపూర్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మలక్‌పేట, మహంకాళి తదితర పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వివరించారు. కొందరు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరికొందరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. డాక్టర్ పద్మజకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తునకు సంబంధించిన కీలక ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందువల్ల ఆమె బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని హైకోర్టును పోలీసులు కోరారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!