

ప్రముఖ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ షావుకారు జానకి తన కళా ప్రస్థానాన్ని ప్రారంభించారని సీఎం గుర్తుచేశారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగుతూ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.
‘షావుకారు’ సినిమాలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి షావుకారు జానకిగా స్థిరపడిన ఆమె.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లో నటించారని రేవంత్ రెడ్డి తెలిపారు. హిందీ, మలయాళ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారని పేర్కొన్నారు. పలు ప్రముఖ చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. చలనచిత్ర రంగంలో ఆమె లేని లోటు పూడ్చలేనిదని పేర్కొంటూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!