

తమిళనాట సినిమాలు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎంజీఆర్ నుంచి ప్రస్తుత సీఎం విజయ్ వరకు పలువురు సినీ నేపథ్యం ఉన్నవారే రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తాజాగా పలువురు కోలీవుడ్ హీరోలు కూడా ప్రజాసేవపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో హీరో శివకార్తికేయన్ రాజకీయ ప్రవేశంపై చర్చ మొదలైంది. చెన్నై పోరూర్‌లో అభిమానులతో నిర్వహించిన సమావేశానికి సుమారు 3 వేల మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాట ఆసక్తికరంగా మారాయి. తనను ‘సెల్ఫ్ మేడ్ స్టార్’ అని పిలవడం కంటే ‘పీపుల్స్ మేడ్ స్టార్’గా భావిస్తానని శివకార్తికేయన్ అన్నారు.
విమర్శలను పట్టించుకోకుండా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలని అభిమానులకు సూచించారు. సామాజిక మాధ్యమాల్లో సమయాన్ని వృథా చేయకుండా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని, చదువు, ఆర్థిక స్వాతంత్ర్యం, కుటుంబాన్ని బాగా చూసుకోవడమే నిజమైన అభిమానం అని పేర్కొన్నారు. ప్రస్తుతం శివకార్తికేయన్ ‘సేయోన్’తో పాటు ‘ఎస్‌కే27’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘సేయోన్’కు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తుండగా, ‘ఎస్‌కే27’ను రామ్‌కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కిస్తున్నారు. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన రాజకీయ ప్రవేశంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!