

నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలపై నేపాల్ చేసిన ఆరోపణలను చైనా ఖండించింది. ముందస్తు హెచ్చరికలు ఉద్దేశపూర్వకంగా ఇవ్వలేదన్న ఆరోపణలను తోసిపుచ్చిన నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయం.. ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంది. బాధితులను రక్షించడం, సహాయక చర్యలను వేగవంతం చేయడంపైనే దృష్టి పెట్టాలని సూచించింది. చైనా వైపు ఉన్న డ్యామ్ కూలిపోవడం వల్లే నేపాల్‌లో విధ్వంసం జరిగిందన్న ప్రచారాన్ని కూడా బీజింగ్ ఖండించింది. ఆ వాదనలను పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.
భూకంపం లేదా భూకంపం తరహాలో మంచు చరియలు కూలిపోవడం, ఆ తర్వాత మంచు, రాళ్లు, మట్టి, నీరు భారీగా దిగువ ప్రాంతాలకు ప్రవహించడం వల్లే విపత్తు సంభవించిందని చైనా తెలిపింది. ఈ జలవిలయంలో 175 మందికి పైగా మృతి చెందగా.. 1,300 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. మరోవైపు వరదలకు కారణంపై USGS, ఇస్రో విశ్లేషణల్లో భిన్నమైన అంచనాలు వెలువడ్డాయి. ముందస్తు హెచ్చరికలపై నేపాల్ ప్రశ్నలు లేవనెత్తగా.. చైనా మాత్రం ఆరోపణలను తోసిపుచ్చింది. ఇదిలా ఉండగా టిబెట్‌లో చైనా సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించడంతో పాటు టెంట్లు, దుప్పట్లు, ఇతర అత్యవసర సామగ్రిని అందిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!