

చైనా–టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల నేపథ్యంలో కైలాష్ మానససరోవర్ యాత్రకు వెళ్లిన యాత్రికుల భద్రతపై ఆందోళన నెలకొంది. సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈశా ఫౌండేషన్ బృందంలో 300 మంది సభ్యులు యాత్రకు వెళ్లినట్లు సమాచారం. వారిలో 77 మంది యాత్రికులు వరదల అనంతరం ఆచూకీ లేకుండా పోయినట్లు పేర్కొంటున్నారు. గల్లంతైన వారిలో సుమారు 50 మంది భారతీయులు ఉండగా, మొత్తం 19 దేశాలకు చెందిన యాత్రికులు ఈ బృందంలో ఉన్నట్లు సమాచారం. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సద్గురు జగ్గీ వాసుదేవ్ టిబెట్‌లోనే ఉన్నట్లు సమాచారం. పరిస్థితిపై స్పందించిన ఆయన.. చైనా–టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో వందలాది మంది భారతీయులు గల్లంతైనట్లు తెలిపారు. తమ బృందంలోని ఒక గ్రూప్ కూడా కనిపించడం లేదని పేర్కొన్నారు. గైరాంగ్ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని తెలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని చైనా అధికారులను కోరినట్లు వెల్లడించారు. గల్లంతైన యాత్రికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!