

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన కీలక ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. గురువారం దిల్లీలో ప్రధానితో సుమారు గంటన్నర పాటు సమావేశమైన ఆయన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు పురోగతి, గోదావరి–కావేరి నదుల అనుసంధానం తదితర అంశాలను వివరించారు. ఈ నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సాగు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందుబాటులోకి వస్తుందని, దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధిపై మరింత దృష్టి సారించగలవని పేర్కొన్నారు. 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టే అభివృద్ధి పనులకు ఆర్థిక సహాయం అందించాలని, ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నమోదైన లోటు వర్షపాతం కారణంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, బీచ్ రోడ్డు, విశాఖ మెట్రో వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
దిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో అమరావతి 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, బీచ్ రోడ్డు, పోలవరం వద్ద ఐకానిక్ వంతెన నిర్మాణంపై చర్చించారు. పీయూష్ గోయల్‌తో పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి కోసం రాష్ట్రానికి సుమారు 20,378 ఎకరాల ఉప్పు భూములను బదలాయించాలని, ఎగుమతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని కోరారు. జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అనుమతులు, పునరావాస పనులు, 45.72 మీటర్ల కాంటూరు వరకు నీటి నిల్వకు అవసరమైన నిధులపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కనెక్షన్ల కోసం నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌తో మూలపేట పోర్టులో టెర్మినల్, దుగరాజపట్నంలో షిప్‌బిల్డింగ్ కేంద్రం ఏర్పాటుపై చర్చించారు. హోంమంత్రి అమిత్ షాతో రాజకీయ, రాష్ట్ర సంబంధిత అంశాలను ప్రస్తావించారు. అలాగే ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!