

ఎన్విడియా అత్యాధునిక ఏఐ చిప్‌లను అక్రమ మార్గంలో చైనా కంపెనీలకు సరఫరా చేశారనే ఆరోపణల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ అక్రమ నెట్‌వర్క్ వెనుక చైనాకు చెందిన వ్యాపారవేత్త లి మింగ్ ఉన్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ పరిశోధనాత్మక కథనం వెల్లడించింది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే మెగాస్పీడ్ సంస్థలో గతంలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన అలిస్ హువాంగ్, ఆమె భర్త కాంగ్ వియ్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు కథనం ఆరోపించింది. సంస్థ కార్యకలాపాలు, నిర్ణయాల్లో లి మింగ్ కీలకంగా వ్యవహరిస్తూ.. అలిస్‌కు ఉన్నత స్థానం కల్పించి, ఆమెను ముందుంచి తెరవెనుక నుంచి మొత్తం నెట్‌వర్క్‌ను నడిపించారని పేర్కొంది. ఈ నెట్‌వర్క్ ద్వారా సుమారు 7.5 బిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక ఎన్విడియా చిప్‌లు చైనా కంపెనీలకు చేరినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్విడియాతో వ్యాపార సంబంధాలు కలిగిన ఇతర సంస్థలతోనూ లి మింగ్‌కు సంబంధాలు ఉన్నట్లు కథనం వెల్లడించింది.
ఈ వ్యవహారంలో సింగపూర్, మలేసియా మీదుగా చిప్‌లను తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్విడియా కంప్యూటర్ సర్వర్లను ఇతర దేశాలకు మళ్లించారనే ఆరోపణలపై గతేడాది ఫిబ్రవరిలో సింగపూర్‌లో లి మింగ్‌పై కేసు నమోదైంది. మెగాస్పీడ్ సంస్థ కోసం కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి భారీగా ఏఐ చిప్‌లను సేకరించి, వాటిని మలేసియాకు తరలించి అక్కడి నుంచి మరో దేశానికి పంపించారని సింగపూర్ ప్రాసిక్యూటర్లు ఆరోపించినట్లు కథనం పేర్కొంది. ఆ దేశాన్ని అధికారికంగా చైనాగా గుర్తించలేదు. అలిస్ భర్త కాంగ్ వియ్‌కు కూడా ఆమె వ్యాపార సంబంధాల గురించి ముందే తెలుసన్న కథనాలు వెలువడ్డాయి. మరోవైపు మెగాస్పీడ్ కార్యకలాపాలపై అమెరికా, సింగపూర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్విడియా టెక్నాలజీని మెగాస్పీడ్ కొనుగోలు చేసి, అక్రమ మార్గంలో చైనా టెక్నాలజీ సంస్థ అలీబాబాకు సరఫరా చేసిందా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. అయితే తాము ఎగుమతి నిబంధనలను ఉల్లంఘించలేదని మెగాస్పీడ్ స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!