

చైనా నుంచి బంగ్లాదేశ్‌కు ప్రయాణిస్తున్న ఓ సరుకు రవాణా నౌకను ఇండోనేషియా నౌకాదళ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొమొరోస్ జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంవీ స్టార్ లైన్స్’ అనే నౌక చైనాలోని లియాన్యుంగాంగ్ పోర్టు నుంచి బంగ్లాదేశ్‌లోని మోంగ్లా రేవుకు వెళ్తుండగా.. నవంబర్ 7న బెల్వాన్ సమీపంలోని ఇండోనేషియా జలాల్లో అధికారులు అడ్డగించారు. నౌకలోని సిబ్బంది అనుమానాస్పదంగా వ్యవహరించడంతో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 15 కంటైనర్లలో నిల్వ ఉంచిన 405 టన్నుల సోడియం పెర్‌క్లోరేట్‌ను గుర్తించారు. రాకెట్లు, క్షిపణుల తయారీలో ఉపయోగించే ఈ రసాయనంతో సుమారు 100 క్షిపణులను తయారు చేయవచ్చని ఇండోనేషియా నౌకాదళ కమాండర్ వెల్లడించారు. ఈ సరుకును రహస్యంగా బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
నౌకలో లక్షలాది రిజిస్టర్ కాని సిమ్ కార్డులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నౌక రిజిస్ట్రేషన్, షిప్పింగ్ పత్రాల్లోనూ పలు వ్యత్యాసాలు ఉన్నట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో చిన్నపాటి ఆయుధాల తయారీకి సంబంధించిన దేశీయ రక్షణ పరిశ్రమ ఉన్నప్పటికీ.. రాకెట్లు, క్షిపణుల ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలు లేవని సమాచారం. ఈ నేపథ్యంలో క్షిపణుల తయారీలో ఉపయోగించే రసాయనాన్ని చైనా నుంచి బంగ్లాదేశ్‌కు ఎందుకు తరలిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సరుకును రవాణా చేస్తున్న షిప్పింగ్ కంపెనీ, నౌక యజమానులు, బంగ్లాదేశ్‌లో దానిని దిగుమతి చేసుకోనున్న వ్యక్తులు లేదా సంస్థల వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ రవాణా వెనుక ఉన్న ఉద్దేశం, సంబంధిత వ్యక్తుల వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!