

మారిటైం రంగంలో ఆగ్నేయాసియా దేశాలతో బలమైన, శాశ్వత భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సముద్ర అనుసంధానం, సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో ఆయా దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇండియా ఫౌండేషన్, విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో విశాఖపట్నంలో నిర్వహించిన ఏషియన్-ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 1,053 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, విశాఖపట్నానికి గొప్ప సముద్ర చరిత్రతో పాటు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు ఉందని వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రధాన మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు రికార్డు స్థాయిలో 91.17 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించిందని, దాదాపు 10 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడలో నాలుగు కొత్త పోర్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇవి రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు రాష్ట్రంతోపాటు పొరుగు ప్రాంతాల్లోని పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నారు.
దుగరాజపట్నంలో సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడితో భారీ షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు లోకేశ్ తెలిపారు. విశాఖపట్నంలో పోర్టుల విస్తరణ, లాజిస్టిక్స్, ప్రత్యేక టెర్మినళ్లు, నౌకల మరమ్మతుల వంటి రంగాలకు సంబంధించి గత వారం సుమారు రూ.7,500 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. పోర్టులను పరిశ్రమలతో, పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కూడా సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. సాగరమాల, మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 వంటి కార్యక్రమాల ద్వారా పోర్టులు, నౌకా నిర్మాణం, రవాణా, సరకు నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు. భారత నౌకా నిర్మాణ, సముద్ర రంగాల బలోపేతానికి సుమారు రూ.70 వేల కోట్ల ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, ఇందులో రూ.25 వేల కోట్ల మారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్ కూడా ఉందని పేర్కొన్నారు. దేశ వాణిజ్యంలో సరకు పరిమాణం పరంగా దాదాపు 95 శాతం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోందని, ఆర్థికాభివృద్ధికి ఆధునిక పోర్టులు, నౌకాయాన మౌలిక సదుపాయాలు కీలకమని అన్నారు. ప్రతి కొత్త పోర్టు పరిశ్రమలు, వ్యాపారాలు, యువతకు కొత్త అవకాశాలను అందిస్తుందని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!