

పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇల్లు, స్వచ్ఛమైన తాగునీరు, వైద్యం వంటి కనీస అవసరాలు అందుబాటులో లేకపోవడం కూడా పేదరికం కిందకే వస్తుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆమె లింక్డిన్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఒక్క తీవ్రమైన అనారోగ్యం కూడా వైద్య ఖర్చులు భరించలేని కుటుంబాన్ని కటిక పేదరికంలోకి నెట్టివేయగలదని పేర్కొన్నారు. 2011 నుంచి 2023 మధ్య భారత్‌లో దాదాపు 50 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచబ్యాంక్ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత దశాబ్ద కాలంలో దేశం పేదరిక నిర్మూలన దిశగా గణనీయమైన పురోగతి సాధించిందని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని ఆమె వివరించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా చేరేలా ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని నిర్మలా సీతారామన్ తెలిపారు. అంత్యోదయ లక్ష్యంతో స్వచ్ఛ భారత్ మిషన్, జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ముద్ర రుణాలు వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. నాగాలాండ్‌లోని కిఫిరే జిల్లాకు చెందిన లఖ్‌పతి దీదీ ఎస్థర్ చిరుధాన్యాలతో తయారు చేసిన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారని, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుష్మితా ఘరాయ్ ముద్ర రుణం సాయంతో తమ కుటుంబ ప్రింటింగ్ వ్యాపారాన్ని తిరిగి నిలబెట్టుకున్నారని ఆమె ఉదాహరణలుగా ప్రస్తావించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!