

భారత్‌లోని పవిత్ర గంగా నది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు విదేశీ మహిళా పర్యాటకులు చేపట్టిన చర్య ఇప్పుడు నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో గంగా నది ఒడ్డున పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను కొందరు విదేశీ మహిళలు స్వయంగా తొలగించారు. చేతులకు గ్లౌజులు ధరించి, చెత్త సంచులు పట్టుకుని నది ఒడ్డున చెల్లాచెదురుగా పడి ఉన్న ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలను సేకరించారు. ప్రసన్న కుమార్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది.
ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో ఎంతో పవిత్రంగా భావించే గంగా నదిని శుభ్రం చేసేందుకు విదేశీ పర్యాటకులు ముందుకు రావడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత అని, దాన్ని కేవలం పారిశుద్ధ్య కార్మికులు లేదా స్వచ్ఛంద కార్యకర్తలకే పరిమితం చేయకూడదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఎన్ని శుభ్రతా కార్యక్రమాలు నిర్వహించినా ప్రజలు చెత్తను నదుల్లో, పరిసరాల్లో పడేయడం మానుకోకపోతే ఆశించిన ఫలితం ఉండదని మరికొందరు పేర్కొంటున్నారు. గంగా నది తీరంలో పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!