

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాజకీయ కారణాలతో క్లియరెన్స్ ఇవ్వలేమని విదేశాంగ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణరైజింగ్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని బోస్టన్, న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో పర్యటించి హార్వర్డ్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో అవగాహన ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే అనుమతి నిరాకరణతో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా వెళ్లకుండా ఆగస్టు 23న లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అదే సమయంలో అమెరికా పర్యటనను అధికారులు కొనసాగించి, ఆయా విద్యాసంస్థలతో ప్రతిపాదిత ఒప్పందాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
విద్య, నైపుణ్యాలు, యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి విద్య, నైపుణ్యాల కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. అమెరికా పర్యటనకు అనుమతి లభించకపోయినా, లండన్‌లో తన షెడ్యూల్ ప్రకారం ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే బ్రిటన్‌లోని ప్రముఖ క్రీడా, నైపుణ్యాభివృద్ధి సంస్థలతో చర్చలు జరిపి తెలంగాణతో భాగస్వామ్యాలను ఏర్పరచుకునే అవకాశాలను పరిశీలించనున్నారు. “తెలంగాణరైజింగ్ ఆగదు. యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, దేశ ప్రగతి రాజకీయాల కంటే ఎంతో ముఖ్యమైనవి” అని సీఎం పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!