

నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ దాఖలు చేసిన 94 పేజీల ఛార్జ్‌షీట్ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఎన్‌టీఏకు చెందిన సబ్జెక్ట్ నిపుణులు, మధ్యవర్తులు కలిసి వ్యవస్థీకృత ముఠాగా పనిచేసి ప్రశ్నాపత్రాలను లీక్ చేసినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ కేసులో పీవీ కులకర్ణి, మనీషా మాందరే, మనీషా హవల్దార్ కీలక నిందితులుగా ఉన్నట్లు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించింది. ప్రశ్నలను గుర్తుపెట్టుకోవడం, చీటీలపై రాసుకోవడం, పుస్తకాలలో సంబంధిత పేరాలను గుర్తించడం ద్వారా ఆ సమాచారాన్ని మధ్యవర్తులు, కోచింగ్ సెంటర్లకు చేరవేసినట్లు సీబీఐ ఆరోపించింది.
దర్యాప్తులో ఎన్‌టీఏ పరీక్షల భద్రతా వ్యవస్థలో పలు లోపాలు ఉన్నట్లు కూడా సీబీఐ గుర్తించింది. ప్రశ్నాపత్రాల తయారీలో పాల్గొనే నిపుణులను సున్నిత ప్రాంతాల్లోకి ప్రవేశించే సమయంలో లేదా బయటకు వచ్చే సమయంలో కఠినంగా తనిఖీ చేసే విధానం లేకపోవడం వల్ల గోప్య సమాచార లీకేజీకి అవకాశం ఏర్పడిందని పేర్కొంది. దర్యాప్తులో స్వాధీనం చేసుకున్న చేతిరాత నోట్స్ ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చాయని తెలిపింది. ఆర్థిక లాభాలతో పాటు కోచింగ్ సెంటర్ల విజయశాతాన్ని పెంచడమే ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశమని సీబీఐ పేర్కొంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా విద్యార్థి నిరసనలకు దారితీసి పరీక్షల నిర్వహణపై తీవ్ర చర్చకు కారణమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!