

చిలకలగూడ పరిధిలో బీటెక్ విద్యార్థి బొమ్మన యావన్ అలియాస్ అఖిల్ హత్య ముందస్తు పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. యువతి బంధువులు వారం రోజులుగా హత్యకు కుట్ర పన్నినట్లు సమాచారం. గురువారం రాత్రి మేడిబావిలో స్నేహితులతో కలిసి కూర్చున్న యావన్‌పై బైక్‌లపై వచ్చిన ఆరుగురు యువకులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యావన్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్య అనంతరం నిందితులు యావన్ చిత్రంపై “పూర్తి హత్య” అని రాసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
యువతి బావ సాయి, సోదరుడు పరమేశ్ ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. యువతితో ఫిర్యాదు చేయించాలని ఒత్తిడి తెచ్చినట్లు, లేదంటే ఇద్దరినీ చంపేస్తామని బెదిరించినట్లు ఓ ధ్వని సంభాషణ వెలుగులోకి వచ్చింది. నిందితుడు సాయికి గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యావన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు యువతి ఇంటి వద్ద ఆందోళనకు దిగగా పోలీసులు అడ్డుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!