

సరుకు రవాణాను వేగవంతం చేయడంతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో విశాఖపట్నం ఓడరేవులో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ పరిధిలో రూ.334.89 కోట్ల అంచనా వ్యయంతో అంతర్గత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖ అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఢిల్లీలో వెల్లడించారు.
కాన్వెంట్ జంక్షన్ నుంచి డాక్ ప్రాంతాన్ని అనుసంధానిస్తూ సుమారు 3.584 కిలోమీటర్ల పొడవున ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే పోర్టు పరిధిలోని తొమ్మిది ప్రధాన రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద గంటల తరబడి కొనసాగే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. పోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా నిర్మాణ పనులు చేపట్టి 30 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సోనోవాల్ తెలిపారు. ప్రధాని గతిశక్తి విధానానికి అనుగుణంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టు విశాఖ పోర్టు సామర్థ్యాన్ని మరింత పెంచి, వికసిత్ భారత్ లక్ష్యానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!