

అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌పై అమెరికా కార్మిక శాఖ చర్యలు చేపట్టింది. వలస కార్యక్రమాల్లో మోసపూరిత విధానాలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో, సంస్థ దాఖలు చేసే కొత్త పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తులను నిలిపివేసింది. ఉద్యోగి ఆధారిత గ్రీన్‌కార్డు ప్రక్రియలో పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ కీలకమైన తొలి దశ. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథొనీ డి ఎస్పోసిటో ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికన్ కార్మికులకు ముప్పు కలిగించే చర్యలను సహించబోమని, వైట్‌హౌస్ ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి వాస్తవాలు, మోసాలు, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.
విజిల్‌బ్లోయర్ల నుంచి అందిన పలు ఫిర్యాదుల ఆధారంగానే ఈ చర్య చేపట్టినట్టు ఎస్పోసిటో తెలిపారు. అయితే ఆరోపణల పూర్తి వివరాలను, ప్రభావితమైన దరఖాస్తుల సంఖ్యను కార్మిక శాఖ వెల్లడించలేదు. ఇప్పటికే ఆమోదం పొందిన సర్టిఫికేషన్లపై ఈ నిలిపివేత ప్రభావం ఉండదని, హెచ్-1బీ వీసా కార్యక్రమానికి ఇది వర్తించదని స్పష్టం చేశారు. కాగ్నిజెంట్‌తో పాటు క్లౌడెరా అనే మరో టెక్ కంపెనీపై కూడా సమాంతరంగా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఈ చర్యకు ఒక్కరోజు ముందే కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ 1,500 మంది అమెరికన్ కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటామని, తమ వర్క్‌ఫోర్స్‌ను 15,000కు విస్తరిస్తామని ప్రకటించారు. యూఎస్‌సీఐఎస్ గణాంకాల ప్రకారం, కాగ్నిజెంట్ హెచ్-1బీ పిటిషన్ల ఆమోదాలు 2020లో 9,413 నుంచి 2026లో 3,510కి తగ్గాయి. కొత్త దరఖాస్తులను నిరోధించే అధికారం కార్మిక శాఖకు ఉందా అనే అంశంపై స్పష్టత లేదని ఇమిగ్రేషన్ న్యాయవాది పూర్వి చోతానీ పేర్కొన్నారు. కాగ్నిజెంట్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం భారత ఐటీ నిపుణుల దీర్ఘకాలిక ప్రాజెక్టుల డెలివరీ విధానాలను ప్రభావితం చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కాగ్నిజెంట్, నాస్కామ్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!