

దేశంలో చక్కెరకు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచే ప్రయత్నాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చక్కెర నిల్వలపై పరిమితులు విధించడంతో పాటు, సుంకం లేకుండా 10 లక్షల టన్నుల ముడిచక్కెర దిగుమతికి అనుమతించింది. దీంతో మిల్లుల నుంచి విక్రయించే చక్కెర ధరలు 20 శాతం వరకు తగ్గినట్లు కేంద్రం తెలిపింది. రిటైల్ ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొంది. సరఫరా సజావుగా కొనసాగేందుకు సెప్టెంబర్ నుంచి మిల్లులకు ప్రతి 15 రోజులకు ఒకసారి విక్రయ కోటా కేటాయించనున్నారు.
చక్కెర మిల్లుల నిల్వలను తనిఖీ చేయగా, కొన్ని మిల్లులు నివేదికల్లో పేర్కొన్న దానికంటే అధిక నిల్వలు కలిగి ఉన్నట్లు, మరికొన్ని కేటాయించిన కోటా మేరకు విక్రయాలు చేయలేదని ప్రభుత్వం గుర్తించింది. కొత్త విధానంలో మిల్లులు కేటాయించిన కోటాలో కనీసం 40 శాతాన్ని మొదటి వారంలో, మిగిలిన మొత్తాన్ని తదుపరి వారంలో విక్రయించాలి. విక్రయించిన ఏడు రోజుల్లోపు నిల్వలను పంపించాలని ఆదేశించారు. అక్టోబర్ 15 నుంచి 2026–27 చక్కెర మార్కెటింగ్ సంవత్సరం చెరకు క్రషింగ్ ప్రారంభం కానుండగా, మొదటి నెలలో 10 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి అవుతుందని అంచనా. పండగల కోసం ప్రజలు అవసరానికి మించి చక్కెర నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!