

తక్కువ సంఖ్యలో క్లయింట్లు ఉన్న స్టాక్ బ్రోకర్లకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తీసుకుంది. బ్రోకర్ల ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వ్యవస్థల్లో సాంకేతిక లోపాలు ఏర్పడినప్పుడు అమలు చేయాల్సిన నిబంధనల్లో సడలింపులు ప్రకటించింది. నియమాలను సరళతరం చేయడంతో పాటు జరిమానాలను తగ్గిస్తూ, చిన్న బ్రోకర్లను కొన్ని నిబంధనల నుంచి మినహాయించాలని సెబీ ఆదేశించింది. సవరించిన నిబంధనల ప్రకారం, బ్రోకర్ నియంత్రణలో లేని సాంకేతిక లోపాలకు వారిపై బాధ్యత ఉండదు. మార్కెట్ మధ్యవర్తులకు వ్యాపారం మరింత సులభంగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబీ వెల్లడించింది. పరిమిత వ్యాపారం కలిగి, టెక్నాలజీపై తక్కువగా ఆధారపడే చిన్న బ్రోకర్లకు మినహాయింపు ఇచ్చే అర్హత ప్రమాణాల్లో మార్పులు చేసినట్లు కూడా ప్రకటించింది.
ఈ నిబంధనలు 10,000 కంటే ఎక్కువ నమోదిత క్లయింట్లు ఉన్న బ్రోకర్లకు మాత్రమే వర్తిస్తాయని సెబీ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఇంతమంది క్లయింట్లు ఉన్న బ్రోకర్లు తక్కువగానే ఉండటంతో, ఈ మార్పులతో సుమారు 60 శాతం బ్రోకర్లకు మినహాయింపు లభించనుంది. బ్రోకర్ల ట్రేడింగ్ వ్యవస్థల పరిధికి బయట ఏర్పడే లోపాలు, ట్రేడింగ్‌పై ప్రత్యక్షంగా లేదా స్వల్పంగా మాత్రమే ప్రభావం చూపే ఘటనలకు కూడా మినహాయింపులు వర్తిస్తాయి.
ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు, బ్రోకర్లు రెండు గంటల లోపే ఎక్స్ఛేంజీలు మరియు తమ క్లయింట్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్ఛేంజీలు ఆ వివరాలను తమ వెబ్సైట్లలో పొందుపరుస్తాయి. బ్రోకర్లు ట్రేడింగ్ యాప్‌లు, వెబ్సైట్లు, ఎస్ఎంఎస్, ఇమెయిల్, పాప్-అప్ అలెర్ట్‌ల ద్వారా క్లయింట్లకు తెలియజేయాలి. ఘటన జరిగిన టీ+1 రోజులోగా ప్రాథమిక నివేదికను ఎక్స్ఛేంజీకి సమర్పించాలి. తదుపరి రోజు సెలవు అయితే గడువు పొడిగింపు లభిస్తుంది. సంఘటన జరిగిన 14 రోజుల్లోగా సామూహిక్ ప్రతివేదన్ మంచ్ పోర్టల్ ద్వారా పూర్తి విశ్లేషణ నివేదిక దాఖలు చేయాలి. అలాగే, ఘటన తీవ్రత, పునరావృతం ఆధారంగా ఆర్థిక జరిమానాలను కూడా హేతుబద్ధీకరించినట్లు సెబీ తెలిపింది. సవరించిన నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చాయని సంస్థ ప్రకటించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!