

తిరుమలకు వచ్చే భక్తులకు వసతి గదుల కేటాయింపును మరింత సులభతరం, పారదర్శకంగా చేయడానికి టీటీడీ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ (సీఆర్వో)లో ముందుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. ఆధార్, మొబైల్ నంబర్, ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా నమోదు పూర్తిచేసిన భక్తులు రూ.50, రూ.100, రూ.1,000 కేటగిరీల్లో తమకు కావాల్సిన గదులను ఎంపిక చేసుకోవచ్చు. గది కేటాయింపు వివరాలను డిస్ప్లే బోర్డులు, ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ఎంఎస్ అందని వారు కీయోస్క్లో స్లిప్ స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
ఉప విచారణ కార్యాలయాల్లో ఆన్లైన్ చెల్లింపు అనంతరం గది తాళాలు అందజేస్తామని టీటీడీ తెలిపింది. 21 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే గదులు కేటాయించబడతాయని, ఒంటరి వ్యక్తులు, అవివాహితులకు గదులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఒకసారి గది పొందిన భక్తులకు 30 రోజుల వరకు మరోసారి గది కేటాయించబోదని పేర్కొంది. గదులు 24 గంటల వ్యవధికే పరిమితం కాగా, గడువు దాటితే అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. గదులను ఇతరులకు విక్రయించడం లేదా బదిలీ చేయడం పూర్తిగా నిషేధమని, తిరుమలలో పరిశుభ్రతను కాపాడేందుకు ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని కూడా నివారించాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!