

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) సెప్టెంబరు త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది. కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 33.8 శాతం పెరిగి రూ.29,550 కోట్లకు చేరుకుంది. ఏకీకృత ఆదాయం 27.8 శాతం వృద్ధితో రూ.3.62 లక్షల కోట్లకు చేరింది. చమురు నుంచి రసాయనాల (ఓ2సీ) వ్యాపారంలో మెరుగైన రిఫైనింగ్ మార్జిన్లు, డిజిటల్ సేవల్లో వృద్ధి సంస్థ లాభాలకు దోహదపడ్డాయి. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య కూడా ఓ2సీ వ్యాపారం అత్యుత్తమ త్రైమాసిక పనితీరు కనబరిచిందని ఆర్‌ఐఎల్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు.
జియో ప్లాట్‌ఫామ్స్ ఆదాయం 11.3 శాతం పెరిగి రూ.47,485 కోట్లకు చేరగా, నికర లాభం 13.7 శాతం వృద్ధితో రూ.8,387 కోట్లుగా నమోదైంది. జియో వినియోగదారుల సంఖ్య 54.24 కోట్లకు చేరింది. మరోవైపు రిలయన్స్ రిటెయిల్ స్థూల ఆదాయం 6.43 శాతం పెరిగి రూ.91,716 కోట్లకు చేరినప్పటికీ, నికర లాభం 24.3 శాతం తగ్గి రూ.2,611 కోట్లుగా నమోదైంది. ఈ త్రైమాసికంలో 303 కొత్త స్టోర్లు ప్రారంభమయ్యాయి. జియో లిస్టింగ్ నేపథ్యంలో తొలిసారిగా ఇన్వెస్టర్ కాల్‌లో పాల్గొన్న ఆకాశ్ అంబానీ.. శాటిలైట్ కమ్యూనికేషన్స్, 6జీ, ఏఐ ఆధారిత వాయిస్, డేటా సేవలపై సంస్థ దృష్టి కొనసాగుతుందని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!