

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా బాత్‌రూమ్‌లో జారిపడి ప్రాణాలు కోల్పోవడం సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఆయనకు భార్య అనురాధ లేఖి గుప్తా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనురాధను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంజయ్ జీవితంలో వారి ప్రేమకథ ఎన్నో మలుపులు తిరిగింది. వివాహమైన ఆరేళ్లకే విడిపోయిన ఈ జంట.. మరో ఆరేళ్ల తర్వాత తిరిగి ఒక్కటైంది. తమ విడాకులకు అండర్‌వరల్డ్ మాఫియాతో తలెత్తిన పరిణామాలు పరోక్షంగా కారణమయ్యాయని సంజయ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అనురాధతో రెండున్నరేళ్ల పాటు ప్రేమలో ఉన్న సంజయ్ 1997లో ఆమెను వివాహం చేసుకున్నారు. అయితే, విభేదాల కారణంగా 2003లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కూడా అనురాధను మర్చిపోలేకపోయిన సంజయ్.. ఆమె మనసు గెలుచుకునేందుకు ప్రయత్నించారు. చివరకు 2009లో ఇద్దరూ మరోసారి వివాహం చేసుకున్నారు. అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్న కొందరితో తనకు అపార్థాలు తలెత్తడంతో ఓ స్నేహితుడి ఫ్లాట్ నుంచి ఫోన్‌లో మాట్లాడాల్సి వచ్చిందని సంజయ్ చెప్పారు. అనురాధ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ విషయం ఆమెకు చెప్పకపోవడంతో, తనకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని ఆమె అనుమానించిందన్నారు. అప్పటికే కెరీర్, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతుండటంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి విడాకులకు దారితీశాయని వివరించారు. విడిపోయిన తర్వాత కూడా అనురాధకు, ఆమె కుటుంబానికి అండగా నిలిచానని, ఆ తర్వాత ఆమె తన జీవితంలోకి తిరిగి వచ్చిందని సంజయ్ తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!