

ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చడంతో పలు బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ తమ రెపో ఆధారిత రుణ రేట్లను సవరించాయి. ఈ మార్పులు అక్టోబర్ 8 నుంచి అమల్లోకి వచ్చాయి. పీఎన్‌బీ ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ 8.10 శాతం నుంచి 8.35 శాతానికి, ఇండియన్ బ్యాంక్ రేటు 7.95 శాతం నుంచి 8.20 శాతానికి పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా రేటు 7.90 శాతం నుంచి 8.15 శాతానికి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రేట్లు 8.35 శాతానికి చేరాయి. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ రేటు 8.25 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది.
ఈ పెంపుతో రెపో ఆధారిత ఫ్లోటింగ్ రేట్ రుణాలు తీసుకున్నవారిపై ఈఎంఐల భారం పెరగొచ్చు. ముఖ్యంగా అందుబాటు ధరలు, మధ్యతరగతి గృహాల కొనుగోలుదారులపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. రూ.50 లక్షల గృహ రుణాన్ని 25 ఏళ్ల కాలానికి 7.50 శాతం వడ్డీతో తీసుకుంటే నెలవారీ ఈఎంఐ సుమారు రూ.36,950గా ఉంటుంది. వడ్డీ రేటు 7.75 శాతానికి పెరిగితే ఈఎంఐ రూ.37,766కు చేరుతుంది. అంటే నెలకు సుమారు రూ.817 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!