

అధునాతన కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఐఐటీ ఖరగ్‌పుర్‌కు 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.46 కోట్లు) అందించనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఐఐటీ ఖరగ్‌పుర్ 75వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. ఆ సంస్థ పూర్వ విద్యార్థి, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ నిధుల సాయాన్ని ప్రకటించినట్లు ఐఐటీ డైరెక్టర్ సుమన్ చక్రవర్తి వెల్లడించారు. ఈ నిధులను ప్రధానంగా అధునాతన ఏఐ పరిశోధనలు, విద్యావకాశాల విస్తరణ, ఏఐ సామర్థ్యాల అభివృద్ధి కోసం వినియోగించనున్నారు. తద్వారా పరిశోధకులు, విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
భారతీయ భాషలు, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో ఐఐటీ ఖరగ్‌పుర్ విశేష కృషి చేస్తోందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఆ పరిశోధనల ప్రభావాన్ని మరింత విస్తరించేందుకు గూగుల్ సహకరిస్తుందని తెలిపారు. ఐఐటీ ఖరగ్‌పుర్ తన భవిష్యత్తును తీర్చిదిద్దినట్లే, ఈ సహకారం తదుపరి తరం విద్యార్థుల అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఆవిష్కరణలకు ప్రాధాన్యం పెరుగుతోందని, ఏఐ ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ చేరాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాన్ని ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాయని ఆయన అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!