

మారుతీ సుజుకీ మరోసారి కార్ల ధరలను పెంచింది. ఏడాది వ్యవధిలో ఇది నాలుగో ధరల పెంపు కావడం గమనార్హం. ఈ మేరకు కంపెనీ తాజాగా ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వివరాలను వెల్లడించింది. ఎంపిక చేసిన మోడళ్లపై సగటున 0.31 శాతం వరకు ధరలు పెంచినట్లు తెలిపింది. ఈ పెంపు నవంబర్ 22, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. ముడి సరుకుల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. వాహనాల ధరలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, వ్యయాల ఒత్తిడి కారణంగా కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయాల్సి వస్తోందని వివరించింది. కొనుగోలుదారులపై భారం వీలైనంత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
మారుతీ సుజుకీ 2026లో ఇప్పటికే పలుమార్లు ధరలను సవరించింది. సెప్టెంబర్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై రూ.20 వేల వరకు పెంచగా, అంతకుముందు ఆగస్టులో అరేనా, నెక్సా విభాగాల్లోని కొన్ని కార్ల ధరలను రూ.30 వేల వరకు పెంచింది. జూన్‌లోనూ రూ.30 వేల వరకు ధరల పెంపును ప్రకటించింది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 26.9 శాతం తగ్గింది. అయితే ఆదాయం మాత్రం 26 శాతం వృద్ధితో రూ.53,340 కోట్లకు చేరినట్లు వెల్లడించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!