

భారత ఐటీ రంగంలో కాంట్రాక్ట్ నియామకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తాత్కాలిక నియామకాలు 10.1 శాతం వృద్ధి చెందాయని సీఐఈఎల్ హెచ్‌ఆర్ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో శాశ్వత ఐటీ ఉద్యోగాల వృద్ధి కేవలం 2.3 శాతానికే పరిమితమైందని తెలిపింది. అంటే శాశ్వత నియామకాలతో పోలిస్తే కాంట్రాక్ట్ స్టాఫింగ్ వృద్ధి నాలుగు రెట్లు అధికంగా ఉంది. ఐటీ రంగ ఆదాయం 6.1 శాతం వృద్ధితో 315 బిలియన్ డాలర్లను అధిగమించనుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో, కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకునేందుకు ఫ్లెక్సిబుల్ హైరింగ్ విధానాలను అనుసరిస్తున్నాయని నివేదిక పేర్కొంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్ కాంట్రాక్ట్ నియామకాలకు ప్రధాన కారణంగా మారింది. ఏఐ, ఎంఎల్ ఉద్యోగాలకు గిరాకీ 45 శాతం పెరగగా, మొత్తం టెక్నాలజీ నియామకాల్లో 80 శాతం నాలుగు నుంచి ఎనిమిదేళ్ల అనుభవం ఉన్నవారికే దక్కాయి. మరోవైపు, భారత్‌లో విస్తరిస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో కాంట్రాక్ట్ ఉద్యోగుల వాటా 2026 చివరి నాటికి 25 శాతానికి చేరవచ్చని అంచనా. కాంట్రాక్ట్ స్టాఫింగ్ స్వల్పకాలిక అవసరాలకే పరిమితం కాకుండా, కంపెనీల దీర్ఘకాలిక వర్క్‌ఫోర్స్ ప్రణాళికలో కీలక భాగంగా మారుతోందని సీఐఈఎల్ హెచ్‌ఆర్ ఎండీ, సీఈఓ ఆదిత్య నారాయణ్ మిశ్రా వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!