

భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ.. అవి కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-అమెరికా వాణిజ్య చర్చలు ప్రతిష్ఠంభనకు చేరుకున్నట్లు కనిపిస్తున్నాయని ఆమె అన్నారు. దిల్లీలో జరిగిన ఓ బిజినెస్ లీడర్స్ సదస్సులో మాట్లాడిన ఆమె.. సంప్రదింపులు కొనసాగుతున్నప్పటికీ, ఈ దశలో ఇరుపక్షాలు మరిన్ని రాయితీలు ఇచ్చిపుచ్చుకోవడం చాలా కష్టమని పేర్కొన్నారు. అయితే, అందుబాటులో ఉన్న అవకాశాలను ఇరు దేశాలు పరిశీలిస్తే చర్చలు ముందుకు సాగే అవకాశం ఉండొచ్చని తెలిపారు.
భారత్‌తో ఉన్న వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే, సంప్రదాయ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి బదులుగా అమెరికా టారిఫ్‌లను ఆయుధంలా ఉపయోగిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందాన్ని ఆమె ప్రస్తావిస్తూ.. అది విజయవంతమైన ఒప్పందమని పేర్కొన్నారు. ఈ డీల్ ద్వారా భారత్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు, భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఇంట్రాడే గరిష్ఠ స్థాయి నుంచి సెన్సెక్స్ ఒక్కసారిగా 450 పాయింట్లకు పైగా పడిపోయింది. అంతకుముందు ఉదయం ఒక దశలో 750 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అయిన సెన్సెక్స్.. అనంతరం ఒడుదొడుకులకు లోనైంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!