

బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాలను పెంచడంతో దేశీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.65 లక్షలు దాటగా, ఒక్క రోజులోనే దాదాపు రూ.9 వేల పెరుగుదల నమోదైంది. కేజీ వెండి ధర రూ.2.95 లక్షలు దాటింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్లో జూన్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 6 శాతం పెరిగి రూ.1,62,648కు చేరుకోగా, జూలై డెలివరీ సిల్వర్ ఫ్యూచర్స్ కూడా భారీగా ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4,707 డాలర్లను, వెండి 86 డాలర్లను దాటింది.
గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లలో కూడా భారీ ర్యాలీ కనిపించింది. క్వాంటమ్ గోల్డ్ ఫండ్ దాదాపు 15 శాతం పెరగగా, టాటా గోల్డ్ ఈటీఎఫ్, జిరోదా గోల్డ్ ఈటీఎఫ్‌లు కూడా లాభపడ్డాయి. మరోవైపు, వరుసగా మూడో రోజు జ్యువెలరీ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనుగోళ్లను తగ్గించాలని చేసిన పిలుపు, దిగుమతి సుంకాల పెంపు కారణంగా గిరాకీ తగ్గవచ్చనే అంచనాలతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ షేరు 11 శాతం పడిపోగా, కల్యాణ్ జ్యువెలర్స్, సెంకో గోల్డ్ షేర్లు కూడా నష్టపోయాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!