

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM E-Drive పథకం కింద సబ్సిడీ గడువును 2028 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ పథకం అమలుకు అదనంగా రూ.1,000 కోట్లను కేటాయించింది. కొత్త విధానం ప్రకారం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కిలోవాట్ అవర్‌కు రూ.2,500 చొప్పున సబ్సిడీ అందుతుంది. అయితే ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.5,000 మాత్రమే లభిస్తుంది. ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.5 లక్షలకు మించని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుంది.
ఈ పథకం కింద 45,79,120 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ప్రయోజనం కల్పించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విభాగానికి రూ.2,767 కోట్లు కేటాయించగా, PM E-Drive పథకానికి మొత్తం రూ.11,900 కోట్ల కేటాయింపు ఉంది. 2024 సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ పథకం తొలుత 2027 మార్చి 31తో ముగియాల్సి ఉంది. సబ్సిడీ గడువును పొడిగించాలని రాజ్యసభ స్టాండింగ్ కమిటీ సూచించిన నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీ క్లెయిమ్ చేసుకునేందుకు 2027 డిసెంబర్ 31 చివరి తేదీగా నిర్ణయించారు. కేటాయించిన నిధులు ముందుగానే పూర్తయితే కొత్త క్లెయిమ్‌లను స్వీకరించరు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!