

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అహంకారాలకు, ఈగోలకు తావులేకుండా ప్రజా సేవకులుగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు. అమరావతిలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించుకుని లక్ష్యాల సాధనకు ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా 27 నెలల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని, సంక్షేమానికి రూ.1.40 లక్షల కోట్లు, అభివృద్ధికి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్‌కు కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు.
హంద్రీనీవా, వెలిగొండ మొదటి దశ, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టులను పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నదుల అనుసంధానం ద్వారా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే దేశ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు సాధించిన విజయాలు మంత్రులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాధ్యమయ్యాయని, ఇది మొత్తం బృందం విజయమని స్పష్టం చేశారు.
ప్రతి శాఖలో సంస్కరణలు తీసుకొచ్చి పాలనను మరింత సమర్థవంతంగా మార్చాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. చురుకైన పాలనతో ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందాలని సూచించారు. సాంకేతికత, డేటా ఆధారిత వ్యవస్థలను ఉపయోగించి నిర్ణయాల్లో వేగం, సేవల్లో నాణ్యత పెంచాలని చెప్పారు. ఈ ఏడాది తక్కువ వర్షపాతం కారణంగా నీటి భద్రత సవాలుగా మారిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రేణిగుంట–అరక్కోణం మార్గంలో అదనపు రైల్వే లైన్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో రూ.1,157 కోట్లతో 46 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం జరగనుందని, దీనివల్ల తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!