

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, బీమా కంపెనీలు తమ మొబైల్ యాప్‌లలోనే ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్‌ను నేరుగా అనుసంధానించుకునేలా కొత్త సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (ఎస్‌డీకే)తో పాటు ప్రత్యేక శాండ్‌బాక్స్‌ను ఆవిష్కరించింది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో ఈ ప్రకటన వెలువడింది. కొత్త ఎస్‌డీకే అందుబాటులోకి రావడంతో వినియోగదారులు వేర్వేరు యాప్‌లకు మారాల్సిన అవసరం లేకుండా బ్యాంకింగ్, బీమా లేదా బ్రోకింగ్ యాప్‌లోనే ఆధార్ ఫేస్ ధ్రువీకరణను పూర్తి చేసుకోవచ్చు. గతంలో ఇందుకోసం ప్రత్యేకంగా ఫేస్‌ఆర్‌డీ యాప్‌ను ఉపయోగించాల్సి వచ్చేది.
యూఐడీఏఐ ఛైర్మన్ నీల్‌కంఠ్ మిశ్రా మాట్లాడుతూ.. కొత్త ఎస్‌డీకే ద్వారా భాగస్వామ్య బ్యాంకులు తమ సొంత సర్వర్లపైనే ప్రామాణీకరణను నిర్వహించుకోవచ్చని తెలిపారు. దీంతో యూఐడీఏఐ కేంద్రాలపై భారం తగ్గడంతో పాటు భద్రత మరింత మెరుగుపడుతుందని చెప్పారు. ప్రతిరోజూ వందలాది సైబర్ దాడులు జరుగుతున్నప్పటికీ, తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 10 కోట్ల ఆధార్ ప్రామాణీకరణ లావాదేవీలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఈ సంఖ్య 25 నుంచి 30 కోట్లకు చేరుకునేలా మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
కొత్త ఎస్‌డీకేలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత లైవ్‌నెస్ డిటెక్షన్, స్పూఫింగ్ నిరోధక సామర్థ్యాలు ఉన్నాయి. మరోవైపు, యూఐడీఏఐ ఆవిష్కరించిన శాండ్‌బాక్స్ ద్వారా బాహ్య బయోమెట్రిక్ పరికరాలు అవసరం లేకుండానే యూజర్ ప్రొవిజనింగ్, ఫేస్ క్యాప్చర్, లైవ్‌నెస్ చెక్, ఎర్రర్ హ్యాండ్లింగ్ వంటి దశలను డెవలపర్లు పరీక్షించవచ్చు. 2021లో ప్రారంభమైన ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థ ఇప్పటివరకు 500 కోట్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేసింది. జీవన్ ప్రమాణ్, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి పథకాల్లో దీనిని వినియోగిస్తున్నారు. బీఎఫ్‌ఎస్‌ఐ రంగానికి మార్గదర్శకంగా ఈజ్ ఆఫ్ ఆన్‌బోర్డింగ్ ప్లేబుక్‌ను కూడా యూఐడీఏఐ విడుదల చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!