

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని సీఎం పేర్కొన్నారు. ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఆమె స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం బీసీలు, పేదలు, మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. దాదాపు 80 ఏళ్ల క్రితమే తెలంగాణ గడ్డపై దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటానికి జంగ్ సైరన్ మోగించారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.
సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మ వంటి వీర మహిళల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని సీఎం తెలిపారు. కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆమె సేవలను స్మరించుకున్నామని చెప్పారు. ఐలమ్మతో పాటు తెలంగాణ వీర మహిళలు ప్రదర్శించిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు కూడా ఆదర్శమని అన్నారు. బీసీ విద్యార్థులకు మెరుగైన విద్య, గురుకులాలు, హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు యువత, మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు, గౌరవం, న్యాయం అందించడమే చాకలి ఐలమ్మకు అందించే నిజమైన నివాళి అని సీఎం స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!