

మన పేరు, చిరునామా, తండ్రి పేరు, ఇంకా లైవ్ లొకేషన్ వరకు బయటకు తెలిసిపోతే మనకు ఎలాంటి భద్రత ఉంటుంది? ముఖ్యంగా మహిళలకు ఇది పెద్ద ప్రమాదం. అయినా కూడా కొత్తగా వెలుగులోకి వచ్చిన ఒక వెబ్సైట్ ప్రజల వ్యక్తిగత వివరాలను బట్టబయలు చేస్తోందన్న విషయం అందరినీ కలవరపెడుతోంది. టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న కొద్దీ ప్రైవసీ అనేది పూర్తిగా నశిస్తున్నట్లే కనిపిస్తోంది.
ప్రాక్సీఎర్త్ అనే వెబ్సైట్ ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాకేష్ అనే వ్యక్తి రూపొందించిన ఈ సైట్లో ఒక్క ఫోన్ నంబర్ టైప్ చేస్తేనే పేరు, చిరునామా, తండ్రి పేరు, ఈమెయిల్ ఐడీ, ఇంకా లైవ్ లొకేషన్ వంటి అనేక వ్యక్తిగత వివరాలు బయటపడుతున్నాయి. లాగిన్ కూడా అవసరం లేకుండా ఈ వెబ్సైట్ పని చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
సిమ్ కార్డ్ తీసుకునే సమయంలో ఇచ్చే వ్యక్తిగత సమాచారం టెలికాం రికార్డుల్లో నిల్వ ఉండటంతో, కొన్ని డేటాబేస్ లీక్ల ద్వారా ఈ వివరాలు బయటకు వస్తున్నాయన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూసిన ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వ్యక్తిగత వివరాలు ఇలా అందరికీ కనిపించేలా బయటపడటం వల్ల ఆర్థిక మోసాలు, ఐడెంటిటీ దోపిడీలు జరిగే ప్రమాదం ఎక్కువ.
ఇక ఈ సైట్ను రూపొందించిన రాకేష్ మాత్రం తాను తప్పేమీ చేయలేదని అంటున్నాడు. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న పబ్లిక్ డేటానే ఉపయోగించి ఈ వెబ్సైట్ను డిజైన్ చేశానని చెప్పుకుంటున్నాడు. తన ఇతర ప్రాజెక్టులకు ట్రాఫిక్ రావడానికి ఇది సహాయపడుతుందని కూడా పేర్కొంటున్నాడు.
ప్రస్తుతం భారతీయుల వ్యక్తిగత వివరాలు ఇంత సులభంగా బయటపడుతున్నాయి అన్న విషయం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ సమాచారం దుర్వినియోగం జరిగితే ప్రజల భద్రతే కాదు, ఆర్థిక నష్టం కూడా తలెత్తే ప్రమాదం ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!