

స్పామ్ కాల్స్, నకిలీ సందేశాలకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) చర్యలను ముమ్మరం చేసింది. వాణిజ్య కమ్యూనికేషన్ (UCC) నిబంధనలను ఉల్లంఘించినందుకు జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 1.24 లక్షలకు పైగా మొబైల్ కనెక్షన్లపై ఆంక్షలు విధించింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన 374 సంస్థలను ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక నివేదిక ప్రకారం.. తొలిసారి నిబంధనలు ఉల్లంఘించిన 1,10,325 మొబైల్ కనెక్షన్ల అవుట్‌గోయింగ్ సేవలను 15 రోజుల పాటు నిలిపివేసింది. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడిన 13,777 కనెక్షన్లను ఏడాది పాటు డిస్‌కనెక్ట్ చేయడంతో పాటు, 3,725 ఎస్‌ఎంఎస్ హెడర్లను కూడా ఏడాది పాటు బ్లాక్ చేసింది.
ఈ త్రైమాసికంలో స్పామ్ కమ్యూనికేషన్లపై 15.29 లక్షల ఫిర్యాదులు అందాయని, వాటిలో 7.23 లక్షల ఫిర్యాదులను చర్యలు తీసుకోవాల్సినవిగా గుర్తించినట్లు ట్రాయ్ వెల్లడించింది. వినియోగదారులు ట్రాయ్ డీఎన్‌డీ యాప్ ద్వారా ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు చేసినట్లు తెలిపింది. మరోవైపు, స్పామ్‌ను గుర్తించేందుకు టెలికాం ఆపరేటర్లు ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు 19.9 బిలియన్ల ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను అనుమానిత స్పామ్‌గా గుర్తించాయి. ప్రచార కాల్స్, సేవలు, లావాదేవీలకు సంబంధించిన కమ్యూనికేషన్లను వినియోగదారులు సులభంగా గుర్తించేందుకు 140, 1600 నంబరింగ్ సిరీస్‌లను ట్రాయ్ ప్రవేశపెట్టింది. ప్రచార కాల్స్ 140 సిరీస్ నుంచి, సేవలు మరియు లావాదేవీలకు సంబంధించిన కాల్స్ 1600 సిరీస్ నుంచి వస్తాయని స్పష్టం చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!