

కృత్రిమ మేధస్సు (ఏఐ) కేవలం ఫొటోలు, వినోదానికే పరిమితం కాకుండా రోజువారీ పనులను సులభతరం చేసే సాధనంగా మారుతోంది. ఇందుకు ఉదాహరణగా పూణెకు చెందిన 38 ఏళ్ల ఐటీ ఉద్యోగిని విదులా బెంబాల్కర్ అనుభవం చర్చనీయాంశమైంది. భర్త మరణించిన తర్వాత తన ఆస్తి పన్ను రికార్డుల్లో ఆయన పేరు తొలగించి, తన పేరును నమోదు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ కోసం లాయర్‌ను సంప్రదించగా, రూ.1.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆమె చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ సాయం తీసుకుని అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకున్నారు.
ఏఐ టూల్స్ అందించిన సమాచారంతో అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను స్వయంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ ఫీజుల రూపంలో ఆమెకు రూ.2,432 మాత్రమే ఖర్చయింది. అయితే, ఏఐ ఎలాంటి చట్టాన్ని మార్చలేదు లేదా ప్రభుత్వ ప్రక్రియకు ప్రత్యామ్నాయంగా పనిచేయలేదు. ఇప్పటికే ఉన్న నిబంధనలు, దరఖాస్తు విధానాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మాత్రమే సహాయపడింది. సరైన సమాచారాన్ని ధ్రువీకరించుకుని ఉపయోగిస్తే ఏఐ ద్వారా సామాన్యులు కూడా సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చనే విషయాన్ని ఈ ఘటన మరోసారి చర్చలోకి తెచ్చింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!