

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో ఓ జట్టుకు కెప్టెన్సీ వహించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బిహార్ జట్టుకు తొలి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా రాష్ట్ర క్రికెట్ సంఘం అతడిని నియమించింది. దీంతో 15 ఏళ్ల 7 నెలల వయసులోనే వైభవ్ ఈ ఘనత సాధించాడు. అయితే, కెప్టెన్‌గా అతడి తొలి మ్యాచ్‌లో బిహార్ జట్టు సౌరాష్ట్ర చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ 12 బంతుల్లో 18 పరుగులు చేయగా, బిహార్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. లక్ష్యాన్ని సౌరాష్ట్ర 16.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఈ క్రమంలో క్రొయేషియా ఆటగాడు జెక్ వురుసిక్ పేరిట ఉన్న రికార్డును వైభవ్ అధిగమించాడు. వురుసిక్ 17 ఏళ్ల 311 రోజుల వయసులో క్రొయేషియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే దేశవాళీ టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్ ఆటగాడు తైమూర్ అలీ 17 ఏళ్ల 358 రోజుల వయసులో సాధించిన రికార్డును కూడా వైభవ్ బద్దలుకొట్టాడు. ఈ ఇద్దరి కంటే దాదాపు రెండేళ్ల ముందుగానే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి వైభవ్ క్రికెట్ చరిత్రలో తన పేరును నమోదు చేసుకున్నాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!