

కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) ఐటీ నియమాలు 2021 లో సవరణలను అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త నియమాలు ముఖ్యంగా ఏఐ (AI) ఆధారిత కంటెంట్ మరియు డీప్‌ఫేక్‌ల నియంత్రణపై దృష్టి సారిస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు మధ్యవర్తులకు 10 రోజుల అనుసరణ గడువు ఇచ్చి, ఈ నెల 20 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు “డీప్‌ఫేక్” కు స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చింది. కంప్యూటర్ సాయంతో కృత్రిమంగా సృష్టించబడిన లేదా మార్పులు చేసిన ఆడియో, వీడియో లేదా దృశ్య కంటెంట్ నిజమైన వ్యక్తి లేదా ఘటనలా కనిపిస్తే దాన్ని డీప్‌ఫేక్‌గా పరిగణించనుంది.
ఈ సవరణల్లో ముఖ్యమైన మార్పు డీప్‌ఫేక్ మరియు అనుచిత కంటెంట్ తొలగింపు గడువులో ఉంది. ఇంతకుముందు 36 గంటల గడువు ఉండగా, ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన మూడు గంటలలోపే ఆ కంటెంట్ తొలగించాల్సి ఉంటుంది. అయితే, AI కంటెంట్ లేబులింగ్ విషయంలో ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. ముందుగా కంటెంట్‌లో కనీసం 10 శాతం స్థలాన్ని లేబుల్ కవర్ చేయాలని పేర్కొనగా, ఇప్పుడు అది “స్పష్టంగా కనిపించేలా” ఉండాలని మాత్రమే పేర్కొంది.
కొత్త నియమాలు వినియోగదారులు మరియు ప్లాట్‌ఫారమ్‌లపై కఠిన బాధ్యతలను విధిస్తున్నాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి వినియోగదారులకు నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన చర్యల గురించి తెలియజేయాలని సోషల్ మీడియా సంస్థలకు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే పోస్టుల తొలగింపు, ఖాతాల సస్పెన్షన్ లేదా రద్దు, అలాగే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే ఉల్లంఘన చేసిన వారి గుర్తింపును ఫిర్యాదుదారుకు వెల్లడించాలి. అలాగే, సింథటిక్‌గా రూపొందించిన సమాచారాన్ని పోస్టు చేసినప్పుడు వినియోగదారులు ప్రకటించాలి; ఆ ప్రకటనను ధృవీకరించేందుకు తగిన సాధనాలు కల్పించి, AI లేబుల్ స్పష్టంగా చూపించాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!