

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాలు తగ్గిపోవడంతో భూగర్భ జల మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు పట్టణ ప్రాంతాల్లో బోరుబావులు ఎండిపోతుండటంతో భవిష్యత్‌లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నీటి భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘క్యాచ్ ది రెయిన్ 2026’ జాతీయ ప్రచారాన్ని ప్రారంభించింది.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ భవనాల్లో రూఫ్‌టాప్ రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. రీఛార్జ్ పిట్లు, బావులు నిర్మించడం, వినియోగంలో లేని బోర్లను పునరుద్ధరించడం, చెరువులు, సరస్సులను సంరక్షించడం వంటి చర్యలు చేపట్టనున్నారు.
ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణపై అవగాహన పెంచేందుకు ‘జల సంవాదం’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాలనీ సంఘాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. పెద్ద నగరాల్లో స్పాంజ్ పార్కుల అభివృద్ధి, మొక్కల పెంపకం, వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయనున్నారు. ఈ కార్యక్రమాల అమలును మున్సిపల్ అధికారులు పర్యవేక్షించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!