

భారత్లో తొలి ప్రధాన కృత్రిమ మేధస్సు సదస్సు ‘AI Impact Summit 2026’ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీలో నిర్వహించబడనుంది. ఈ సదస్సు ద్వారా AI సాంకేతికత కొద్ది కంపెనీలు లేదా దేశాల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఉండేందుకు AI మౌలిక సదుపాయాల ప్రజాస్వామ్యీకరణపై ప్రధానంగా దృష్టి సారించనుందని ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ప్రధాన స్థంభాలుగా ప్రపంచవ్యాప్త ప్రాప్యత మరియు మానవాభివృద్ధికి AI వినియోగం నిర్ణయించబడ్డాయి.
MeitY కార్యదర్శి ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న AI విభజనను తగ్గించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అందుకోసం AI ను అందరికీ అందుబాటులో ఉండే సాధనంగా తీర్చిదిద్దుతూ, కంప్యూట్ వనరులు, AI మోడళ్లూ, డేటాసెట్లు భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది. దీని ద్వారా వివిధ దేశాలు, సమాజాలు, సమూహాలకు అనుగుణంగా AI పరిష్కారాలు అభివృద్ధి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ సదస్సు ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య, పాలన, తయారీ రంగాలు వంటి కీలక విభాగాలపై దృష్టి సారించనుంది. ప్రజలు, భూమి, పురోగతి అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ, సమగ్ర వృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మానవ కేంద్రిత AI అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
ఈ సదస్సు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుండగా, 30 కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయి 300 కు పైగా ప్రదర్శనలు ఇందులో భాగం కానున్నాయి. ఈ కార్యక్రమానికి జెన్సెన్ హువాంగ్, డెమిస్ హసాబిస్, డారియో అమోడై , కే. కృతివాసన్, శాంతను నారాయణ్ వంటి ప్రముఖులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!