

కృత్రిమ మేధ ఆధారిత సేవలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా వేగంగా ఎదుగుతోందని క్వాలిజీల్ సంస్థ వెల్లడించింది. ఎవరెస్ట్ గ్రూప్‌తో కలిసి రూపొందించిన శ్వేతపత్రంలో నగరంలో ప్రస్తుతం 400కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు పనిచేస్తున్నాయని పేర్కొంది.
ఈ కేంద్రాల్లో 3 లక్షల మందికి పైగా నిపుణులు పనిచేస్తుండగా, నగరంలో మొత్తం ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో దాదాపు 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు వివరించింది. కృత్రిమ మేధ సాంకేతికతపై పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో 58 శాతం కేంద్రాలు ఇప్పటికే ఏజెంటిక్ కృత్రిమ మేధలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపింది.
2024లో 64.6 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల పరిశ్రమ 2030 నాటికి 105 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోనున్నట్లు అంచనా వేసింది. క్వాలిజీల్‌కు హైదరాబాద్‌లో మూడు కేంద్రాలు ఉండగా, అందులో 850 మందికి పైగా ఇంజినీర్లు పనిచేస్తున్నారు. 2028 నాటికి 100 మిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!