

ప్రపంచ ప్రసిద్ధ శీతలపానీయాల సంస్థ ది కోకాకోలా కంపెనీ తన భారత బాటిలింగ్ అనుబంధ సంస్థ హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. మార్కెట్ నుంచి సుమారు 1 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.9,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులను ఆహ్వానించినట్లు సమాచారం. వచ్చే వారం లండన్‌లో ప్రజెంటేషన్ జరగవచ్చని తెలుస్తోంది. ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఉన్న రోత్‌స్చైల్డ్ అండ్ కో బ్యాంకర్లతో చర్చలు జరపనుంది. అయితే దీనిపై కోకాకోలా అధికారిక ప్రకటన చేయలేదు.
ఇటీవల కాలంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ భారత అనుబంధ సంస్థలను ఐపీఓకు తీసుకొస్తున్న నేపథ్యంలో కోకాకోలా కూడా ఈ జాబితాలో చేరనుంది. కంపెనీకి భారత్ కీలక మార్కెట్‌గా ఉంది. ప్రస్తుతం హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ విలువ సుమారు 10 బిలియన్ డాలర్లుగా అంచనా. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ 12 రాష్ట్రాల్లో 14 తయారీ యూనిట్లు కలిగి ఉంది. దాదాపు 5,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, దేశవ్యాప్తంగా 17 లక్షల రిటైల్ అవుట్‌లెట్లకు సేవలు అందిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!