

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో గూగుల్ మరో కీలక ముందడుగు వేసింది. సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, నాలెడ్జ్ వర్క్, సైన్స్‌కు సంబంధించిన పనుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘జెమిని 4 నియాన్’ మోడల్‌ను ఆవిష్కరించింది. బెంచ్‌మార్క్ పరీక్షల్లో ఈ మోడల్ మంచి పనితీరు కనబరిచినట్లు నివేదికలు వెల్లడించాయి. ఆంత్రోపిక్‌కు చెందిన ‘క్లాడ్ ఓపస్ 5.5’, ఓపెన్‌ఏఐ ‘జీపీటీ-6.2 సోల్’ వంటి మోడళ్లతో పోల్చినప్పుడు పలు పరీక్షల్లో నియాన్ మెరుగైన ఫలితాలు సాధించింది. ఇది ఒక మిలియన్ టోకెన్ల కాంటెక్స్ట్ విండోతో అందుబాటులోకి వచ్చింది. ప్రతి మిలియన్ ఇన్‌పుట్ టోకెన్లకు 3 డాలర్లు, అవుట్‌పుట్ టోకెన్లకు 15 డాలర్ల చొప్పున ధర నిర్ణయించారు.
గూగుల్ ఏఐ మోడళ్ల కుటుంబంలో ‘కార్బన్’ అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టుల కోసం, ‘హైడ్రోజన్’ వేగవంతమైన రోజువారీ పనుల కోసం రూపొందించగా.. ‘నియాన్’ లోతైన విశ్లేషణతో పాటు ఖర్చు పరంగా మెరుగైన సామర్థ్యాన్ని అందించడంపై దృష్టి పెట్టింది. బిల్లింగ్ స్టేట్‌మెంట్ల విశ్లేషణ, రసీదుల వివరాలను సరిపోల్చడం వంటి సాధారణ పనులతో పాటు వృత్తిపరమైన సంక్లిష్ట పనులకూ ఇది ఉపయోగపడుతుంది. జెమిని 4 కార్బన్‌తో సమానమైన భద్రతా ప్రమాణాలను ఇందులో పొందుపరిచినట్లు గూగుల్ పేర్కొంది. ప్రస్తుతం గూగుల్ ఏఐ స్టూడియో ఏపీఐ, జెమిని ఫర్ బిజినెస్ ద్వారా దీన్ని ఉపయోగించవచ్చు. అర్హత కలిగిన గూగుల్ ఏఐ ప్రో, అల్ట్రా సబ్‌స్క్రైబర్లు యాంటీగ్రావిటీతో పాటు జెమిని యాప్‌లోనూ ఈ మోడల్‌ను యాక్సెస్ చేయవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!