

ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా మరియు స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు సంచలన ప్రణాళికలను ప్రకటించారు. భవిష్యత్తులో కృత్రిమ మేధ వినియోగం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తూ, అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు ఆర్థిక బలం చేకూర్చేందుకు తన ఏఐ వ్యాపారాన్ని స్పేస్ఎక్స్తో విలీనం చేసినట్లు వెల్లడించారు. ఈ రెండు సంస్థలు కలిసిన కొత్త ఎంటిటీ త్వరలో ఐపీఓకు వెళ్లనున్నట్లు కూడా మస్క్ స్పష్టం చేశారు. ఏఐ వ్యవస్థలకు అవసరమైన విద్యుత్, కూలింగ్ సమస్యలకు పరిష్కారంగా అంతరిక్ష ఆధారిత డేటా సెంటర్లను సౌరశక్తితో నడపాలని ఆయన యోచిస్తున్నారు.
ఈ ప్రణాళికల్లో భాగంగా కక్ష్యలోకి మొత్తం 10 లక్షల ఉపగ్రహాలను పంపడమే తన లక్ష్యమని మస్క్ వెల్లడించారు. అయితే, ఈ ఆలోచనలపై శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డేటా సెంటర్లు ఉత్పత్తి చేసే అధిక వేడి వల్ల అంతరిక్షంలో కంప్యూటర్ చిప్‌లు వేగంగా ఓవర్‌హీట్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే, ఇప్పటికే స్టార్‌లింక్‌కు చెందిన సుమారు 10 వేల ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్న నేపథ్యంలో, లక్షల సంఖ్యలో శాటిలైట్లు ప్రయోగిస్తే ఢీకొన్న ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. సాంకేతికంగా, ఆర్థికంగా ఈ ప్రాజెక్ట్ ఎదుర్కొనే సవాళ్లు భవిష్యత్తులో కీలక అంశంగా మారనున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!