

డారియో అమోడెయ్, అమెరికాకు చెందిన ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ సీఈవో, భవిష్యత్‌లో ఏఐ కారణంగా తీవ్రమైన ఉద్యోగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ముఖ్యంగా ఎంట్రీ లెవల్ వైట్‌కాలర్ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసే పరిస్థితి వస్తోందన్నారు. డాక్యుమెంట్లను సమరైజ్ చేయడం, కొత్త ఐడియాలు రూపొందించడం, ఫైనాన్షియల్ రిపోర్టులు తయారుచేయడం వంటి పనులను ఏఐ ఇప్పటికే సమర్థంగా నిర్వహిస్తోందని తెలిపారు. దీనివల్ల ఫైనాన్స్, కన్సల్టింగ్, టెక్నాలజీ రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
రెండేళ్ల క్రితం హైస్కూల్ విద్యార్థి స్థాయిలో ఉన్న ఏఐ ఇప్పుడు తెలివైన కాలేజీ విద్యార్థి స్థాయికి చేరుకుందని డారియో పేర్కొన్నారు. రాబోయే ఒకటి నుంచి ఐదేళ్లలో మార్కెట్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని అంచనా వేశారు. అయితే అమెరికా-చైనా మధ్య ఉన్న తీవ్రమైన పోటీ కారణంగా ఏఐ అభివృద్ధిని ఆపడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఉద్యోగులు భవిష్యత్‌లో నిలదొక్కుకోవాలంటే ఏఐ టూల్స్ వినియోగంలో నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో అసమానతలను తగ్గించేందుకు ఏఐ కంపెనీలపై ప్రత్యేక పన్నులు కూడా విధించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!