

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందిస్తున్న డీప్‌ఫేక్ ఫోటోలు, వీడియోలు సమాజానికి పెరుగుతున్న ముప్పుగా మారుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలపై కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు కొత్త నిబంధనలను అమలు చేయాలని స్పష్టంగా ఆదేశించింది.
ఇకపై AI సహాయంతో రూపొందించిన ఏ ఫోటో లేదా వీడియో అయినా, అది AI ద్వారా క్రియేట్ చేసిన కంటెంట్ అని స్పష్టంగా కనిపించేలా తప్పనిసరిగా ‘లేబుల్’ వేయాల్సి ఉంటుంది. ఈ లేబుల్ ద్వారా ఆ కంటెంట్ నిజమైనదా లేదా కంప్యూటర్ సృష్టించిందా అన్న విషయం ప్రజలకు సులభంగా అర్థమవుతుంది. ఒకసారి AI లేబుల్ పెట్టిన తర్వాత, దాన్ని సోషల్ మీడియా సంస్థలు గానీ, కంటెంట్ క్రియేటర్స్ గానీ, ఇతరులు గానీ తొలగించేందుకు అనుమతి ఉండదు.
అదేవిధంగా, ప్రభుత్వం లేదా కోర్టులు ఏదైనా AI కంటెంట్‌ను తప్పుడుదిగా లేదా ఫేక్‌గా గుర్తించి సమాచారం అందిస్తే, కేవలం మూడు గంటలలోపే ఆ వీడియో లేదా ఫోటోను సోషల్ మీడియా నుంచి తొలగించాల్సి ఉంటుంది. అశ్లీలతకు సంబంధించినవి, పిల్లలకు హాని కలిగించే కంటెంట్ లేదా మోసపూరితమైన AI వీడియోలు, ఫోటోలను ఆటోమేటిక్‌గా గుర్తించి అడ్డుకునే ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సోషల్ మీడియా సంస్థలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఈ కొత్త నిబంధనలు ఈ నెల 20, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. నిజం ఏదో, అబద్ధం ఏదో తెలియకుండా ప్రజలను మోసం చేస్తున్న డీప్‌ఫేక్ కంటెంట్‌ను నియంత్రించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వ్యాపించే తప్పుడు ప్రచారాలు, అసభ్యకరమైన వీడియోలు, ఫోటోల నుంచి సామాన్య ప్రజలను రక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!